
కరుణించని వరుణుడు!
మంచిర్యాలఅగ్రికల్చర్: వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితి వెంటాడుతోంది. వర్షాలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నెలకొనడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. భారీ వర్షాల్లేక జలాశయాలు, చెరువులు, కుంట లు, వాగులు బోసిపోసి కనిపిస్తున్నాయి. జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 304.3మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా.. 163.2మీల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జిల్లా సగటున 46శాతం లోటు నెలకొంది. నస్పూర్, జైపూర్, చెన్నూర్ మండలాల్లో అత్యధిక లోటు, మిగతా 15 మండలాల్లో 20 నుంచి 55 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 2,32,220 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 1,47,553 ఎకరాల్లో సాగు కాగా.. విత్తుకునే గడువు ముగిసింది. వరి 74,348 ఎకరాల్లో నారు పోశారు. దీర్ఘకాలిక వరి(140 నుంచి 150 రోజులు) నాట్లు వేసుకునే గడువు ముగిసింది. ఈ నెలలో భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండితే ఆగస్టు వరకు స్వ ల్పకాలిక వరి(110 నుంచి 120రోజులు) సాగుకు వచ్చే నెల వరకు అవకాశం ఉంది. నెలాఖరు వరకు వరి నారు పోసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సరైన వర్షాలు కురిసి ఉంటే ఇప్పటికే 75శాతం వరి నాట్లు పూర్తి కావాల్సి ఉండగా.. ఇంకా నారే పోసుకోలేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నారు పోసుకున్నా వర్షాల్లేక నాట్లు వేసుకోలేదు.
చెరువులు.. కుంటలు వెలవెల
జిల్లాలో నోటిఫైడ్ చెరువులన్నీ వట్టిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 38డిగ్రీలు నమోదవుతున్నాయి. జూన్‌లో కురిసిన వర్షాలకు కొన్ని చెరువులు, కుంటల్లోకి చేరిన నీరు సైతం ఇంకిపోతోంది. జిల్లాలోని గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. నీల్వాయి ప్రాజెక్టులోకి అంతంత మాత్రమే చేరింది. 624 చెరువులు, కుంటల్లోకి 20శాతం కూడా నీరు చేరలేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నారుపోసుకుని బోరుమోటారు ద్వారా నీటితడులు అందిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ప్రాణహిత, గోదావరి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి.
ఎండలు కొడుతున్నాయి..
వానాకాలం వచ్చి నెలన్నర రోజులు గడిచినా వర్షాలు లేక చెరువులు నిండలే.. వాగులు పారలే. ఎండాకాలం లెక్క ఎండలు కొడుతున్నాయి. వరిపొలాలు బీడు భూములుగా మిగిలినయి. ఇంకో పదిహేను రోజులు ఇట్లనే ఉంటే వరిపంట సాగు ఉండదు.
– పున్నం, రైతు,
గ్రామం: సుబ్బరాంపల్లి, మం: చెన్నూర్
జిల్లాలో 46శాతం వర్షపాతం లోటు
పత్తి, దీర్ఘకాలిక వరి రకాలకు ముగిసిన సాగు సమయం

కరుణించని వరుణుడు!