
అందుగులపేటలో సోలార్ ప్లాంట్
జన్నారం/ దండేపల్లి: దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఇందిరా మహిళాశక్తి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు చేయూతనిస్తూ దండేపల్లి మండలం అందుగులపేట(వెల్గనూర్) గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రోజుకు సుమారు 4,500 నుంచి 5 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. ఏడాదికి రూ.51 లక్షల ఆదాయం వస్తుందని వెల్లడించారు. నర్సింగాపూర్ గ్రామంలో రూ.1.63 కోట్ల సీఎస్సార్ నిధులతో 900 మీటర్ల సీసీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. రూ.80 లక్షల ఉపాధి హామీ నిధులతో నాలుగు గ్రామపంచాయతీ భవనాలు, రూ.48 లక్షలతో నాలుగు అంగన్‌వాడీ భవనాల నిర్మిస్తామని పేర్కొన్నారు.
రూ.80 కోట్ల చెక్కులు పంపిణీ..
జిల్లాలోని 863 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.80 కోట్ల విలువైన చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. 8 మందికి ప్రమాద బీమా కింద మంజూరైన రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందించారు. రుణ బీమాకు సంబంధించి రూ.73.37 లక్షలను 83 మంది సభ్యులకు అందజేశారు. వడ్డీ లేని రుణాలు 8,750 మందికి రూ.17,78 కోట్లు అందించారు.