
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
దండేపల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనోద్దిన్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్ గ్రామానికి చెందిన కోవ మహేందర్ (19) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన మహేందర్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించగా మద్యం మానేసి, మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని వైద్యులు చెప్పారు. కానీ మహేందర్ మద్యం మానేయలేదు. ఈనెల 5న కడుపునొప్పి తీవ్రంగా ఉందని, చనిపోవాలని ఉందంటూ అన్న లక్ష్మణ్‌కు చెప్పాడు. తాగుడు మానివేసి మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని లక్ష్మణ్ సముదాయించాడు. అదేరోజు మధ్యాహ్నం మందుల కోసం ఇంట్లో నుంచి వెళ్లిన మహేందర్, దండెపల్లి వాగులో పురుగుల మందు తాగి స్నేహితుడు మోకాషి శేఖర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. శేఖర్ వెంటనే లక్ష్మణ్‌కు ఫోన్ చేయగా లక్ష్మణ్ అక్కడకు చేరుకుని బైక్‌పై మహేందర్‌ను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.