
డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
రెబ్బెన: ఇటీవల ట్రాక్టర్ బోల్తాపడి పులికుంట గ్రామానికి చెందిన దుర్గం మారుతి మృతి చెందగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం పులికుంట వద్ద జాతీయ రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ట్రాక్టర్ యజమాని మృతుడి కుటుంబానికి రూ. 5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ యజమాని వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. సుమారు 45 నిమిషాల పాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు విషయాన్ని ఏఎస్పీ చిత్తరంజన్ దృష్టికి తీసుకెళ్లగా హుటాహుటిన ఆయన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గురువారం ట్రాక్టర్ యజమానిని పిలిపించి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో రాస్తారోకో విరమించారు.