
కేంద్రం హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం
చెన్నూర్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారుల నిర్మాణా లు చేపట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 63వ జాతీయ రహదారి జగ్దల్‌పూర్ నుంచి నిజామాబాద్ రోడ్డు పనులు పూర్తయ్యాయని తెలిపారు. నిజామాబాద్ ఆర్మూర్ వయా మంచిర్యాల వరకు రూ.3376 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిందని తెలిపారు. ఈ పనులు పూర్తయి తే మంచిర్యాల నుంచి నిజామాబాద్‌కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. శ్రీరాంపూర్ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వరకు జాతీయ రహదారి–363 నిర్మాణానికి రూ.2497 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. మంచిర్యాల నుంచి జైపూర్ మీదుగా వరంగల్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు రూ.2606 కోట్లతో ప్రారంభం అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ నిర్మాణం చేపడితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తామే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ఆశోక్, పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మ శ్రీపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎతం శివకృష్ణ, నాయకులు వంశీగౌడ్, శంకర్, రాజు పాల్గొన్నారు.