కరెంట్ షాక్‌తో కౌలు రైతు మృతి
నెన్నెల: కొత్తూర్ గ్రామానికి చెందిన గుగ్లోత్ శ్రీనివాస్(35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. శ్రీనివాస్ పొట్యాల గ్రామ శివారులో కౌలుకు తీసుకున్న పంట పొలానికి రక్షణగా సోలార్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. సోలార్ తీగలకు తెగిన కరెంట్ మోటారు వైర్ తగలడంతో విద్యుత్ సరఫరా జరిగింది. పొలంలో ఎరువులు చల్లుతుండగా ప్రమాదవశాత్తు తీగలు తాకడంతో శ్రీనివాస్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. సమీపంలోని పశువుల కాపరులను పిలిచి మోటారుకు ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు సింధు, బింధుతో పాటు కుమారుడు వరుణ్ ఉన్నారు.
మృతుడి ఆధారాలు లభ్యం
రెబ్బెన: మండలంలోని దేవులగూడ సమీపంలోని రైల్వేట్రాక్‌పై శనివారం రామగిరి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆచూకీ తెలిసినట్లు బెల్లంపల్లి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఆసిఫాబాద్ మండలంలోని బొందగూడకు చెందిన ఇట్యాల శ్రీకాంత్ (30)గా గుర్తించామన్నారు. మృతుడు గ్రామంలో చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని తల్లి సాంతారా బాయితో కలిసి జీవిస్తున్నాడన్నారు. అయితే చిన్నతనంలో శ్రీకాంత్ కుడిచేయి పైనుంచి ఎడ్లబండి వెళ్లడంతో చేయి వంకర తిరిగి వికలాంగుడిగా మారాడని పేర్కొన్నారు. ఆయన తరుచూ గోలేటి, అబ్బాపూర్ ప్రాంతాల్లో ఉండే తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేవాడన్నారు. శనివారం రెబ్బెన మండలంలోని దేవులగూడ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు గల కారణా లు ఏంటో తెలియరాలేదన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కో ణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


