సొంతింటిపై ‘కోర్’ దెబ్బ!
ఉమ్మడి జిల్లాలోని పీవీటీజీలకు పీఎం జన్‌మన్ కింద గృహాలు పక్కా ఇళ్ల కోసం గుడిసెలు కూల్చివేసిన లబ్ధిదారులు కోర్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టొద్దని అటవీశాఖ అభ్యంతరం దిక్కుతోచని స్థితిలో ఉట్నూర్ మండలంలోని 42 గ్రామాల ప్రజలు నేడు కలెక్టర్‌ను కలవనున్న బాధితులు
ఆదిలాబాద్‌రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తమ సొంతింటి కల నెరవేరబోతుందని వారు ఎంతో సంబర పడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు వారి పూరి గుడిసెలను తొలగించుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేసేందుకు ఆదివాసీల సంప్రదాయ బద్ధంగా డోలు వాయిద్యాలతో అధికారులను ఆహ్వానించారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు సైతం తోడుకున్నారు. కొంత మంది లబ్ధిదారులు సిమెంట్ పిల్లర్లు వేసుకున్నారు. తీరా అధికారులు ఈ ప్రాంతాం కోర్ ఏరియా అంటూ, సిమెంట్ నిర్మాణ పనులు చేపట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. గుడిసెలను తొలగించుకోవడంతో ఇప్పుడు తమకు కనీసం నివాసం ఉండేందుకు ఇళ్లు లేవని, చలికాలం కావడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
6,043 ఇళ్లు మంజూరు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీలకు 6,043 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. చాలా చోట్ల ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో 42 గ్రామాలు కోర్ ఏరియా ప్రాంతంలో ఉన్నాయని, లబ్ధిదారులు సిమెంట్‌తో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక వారు ఇంటి నిర్మాణాలను చేపట్టకుండా తాత్కాలికంగా ప్రస్తుతం గుడిసెలలో నివాసముంటున్నారు.
252 మందికి పైగా లబ్ధిదారులు
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో 12కి పైగా గ్రామాలు కోర్ ఏరియాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో సుమారు 252 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. సిమెంట్‌తో ఇండ్లను నిర్మించడానికి వీలు లేదని అధికారులు చెప్పడంతో వారు ఏం చేయాలో తోచక అయోమయంలో ఉన్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఉట్నూర్ మండలంలోని చెరువుగూడ గ్రామానికి చెందిన ఆత్రం కాశీరాం కుటుంబం. ఈ కుటుంబానికి పీఎం జన్‌మన్ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో కుటుంబం వారి గుడిసెను తొలగించుకుని, కొత్త ఇంటి నిర్మాణానికి బేస్‌మెంట్ లెవల్‌లో పునాది వేశారు. అయితే అధికారులు సిమెంట్ ఇంటి నిర్మాణం చేపట్టవద్దని అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతం భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి కర్ర ఇంటిలో నివాసముంటున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


