
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: తండ్రి మందలించాడని కొడుకు షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో ఈఘటన చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. ఉట్నూర్‌లోని శాంతినగర్ కాలనీకి చెందిన చౌహాన్ రాంకుమార్ కుమారుడు చౌహాన్ సాయి (20) ఇంటర్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పని చేసుకోవాలని తండ్రి మందలించాడు. క్షణికావేశంలో ఈనెల 26న రాత్రి ఇంట్లో అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గమనించి ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు పంపించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. తండ్రి రాంకుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అప్పులు తీర్చలేక యువకుడు..
తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన యువకుడు పిట్లెవాడ్ లక్ష్మణ్ (25) అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రెయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి కథనం ప్రకారం..లక్ష్మణ్ గత రెండేళ్ల క్రితం రూ.2 లక్షల అప్పు తీసుకుని ఫైనాన్స్‌పై ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కిరాయికి ట్రాక్టర్ నడవకపోవడంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదు. దీంతో ట్రాక్టర్‌ను అమ్మి కిస్తీలు కట్టాడు. గతంలో తీసుకున్న రూ.2 లక్షల అప్పు ఎలా తీర్చాలనే బెంగతో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి అందరు నిద్రపోయాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న ట్రెయినీ ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య