
టిప్పర్ ఢీకొని రిటైర్డ్ టీచర్ మృతి
ఆదిలాబాద్‌టౌన్: టిప్పర్ ఢీకొట్టి రిటైర్డ్ టీచర్ మృతిచెందిన ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌రూరల్ మండలం చాందా (టి) గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేవళ్ల నారాయణ (65) జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఉంటున్నాడు. ఉదయం మార్నింగ్ వాక్ అనంతరం గాంధీ పార్కు నుంచి విద్యానగర్ వైపు వెళ్తుండగా కుమురంభీం చౌక్‌లో గల సర్కిల్ వద్ద టిప్పర్ ఆయనపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సర్కిల్‌తో ప్రమాదాలు..
సుందరీకరణ పేరిట గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని పలు ముఖ్య కూడళ్లలో సర్కిల్స్ ఏర్పాటు చేసింది. గతంలో కుమురంభీం చౌక్ వద్ద సిగ్నల్స్ ఉండేవి. ఉన్నవాటిని తొలగించి పెద్దగా సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాహనాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఇటీవల కాలంలో నాలుగు దిక్కులా స్పీడ్ బ్రేకర్లు వేశారు. స్పీడ్ బ్రేకర్లు ఎత్తుగా ఉండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం కుమురంభీం చౌక్ సర్కిల్‌లో రెండు కార్లు సైతం ఢీకొట్టాయి.

టిప్పర్ ఢీకొని రిటైర్డ్ టీచర్ మృతి