
కుటుంబానికి జలగండం..!
● సరస్వతి కెనాల్‌లో కొట్టుకుపోయిన యువకుడు ● గతంలో ఇద్దరు సోదరులు చెరువులో పడి మృతి
నిర్మల్‌టౌన్: ఆ కుటుంబాన్ని జలగండం వెంటాడుతోంది. గతంలో ఇద్దరు కొడుకులు చెరువులో పడి మృతి చెందగా, బుధవారం మూడో కుమారుడు సరస్వతి కెనాల్‌లో గల్లంతు కావడం ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇబ్రహీం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో దిలావర్పుర్‌లో ఉండగానే ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. దీంతో ఇబ్రహీం తన కుటుంబాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని సర్ద్‌మహల్‌కాలనీకి మార్చాడు.
ఈతకు వెళ్లి..
ఇబ్రహీం మూడో కుమారుడు హనీఫ్ (17) ఇద్దరు స్నేహితులతో కలిసి బుధవారం స్థానిక సిద్దాపూర్ సమీపంలోని సరస్వతి కెనాల్‌లో ఈతకు వెళ్లాడు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముందుగా దిగిన హనీఫ్ అందులో కొట్టుకుపోయాడు. మిత్రులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కాలువలో హనీఫ్ కోసం గాలిస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మల్ మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్‌లో ఇంటర్ చదువుతున్న హనీఫ్ పరీక్ష ఫలితాలు మంగళవారమే వచ్చాయి. ఇందులో ఆయన పాసయ్యాడు. ఫలితాలు వచ్చిన తెల్లారే ఇలా గల్లంతు కావడంతో విషాదం నెలకొంది.