
● రూ.లక్ష దాటిన తులం బంగారం ● కొండెక్కిన గోల్డ్ ధరలు ●
పసిడి ధర పరుగులు పెడుతోంది. సామాన్యునికి అందనంత దూరంలో ‘లక్ష’ణంగా కొండెక్కి కూర్చుంది. భారతీయ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా తులం బంగారం లక్ష మార్కు దాటేసింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్లో రూ.1,01,600 ధర పలికింది. ఉదయం రూ.1,00,800 పలికిన ధర సాయంత్రానికి మరో రూ.800 పెరిగింది. గత వారం రోజులుగా సుమారుగా రూ.96 వేలు ఉన్న ధర ఏకంగా లక్షకు ఎగబాకింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో శుభకార్యాల సమయంలో కనకాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ అతివలు బంగారంపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధర అధికంగా ఉన్నా తప్పదన్న ఆలోచనతో కొనాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.