
కన్నయ్య మృతిపై కలెక్టరేట్ ముట్టడిస్తాం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ● మృతుడి కుటుంబానికి పరామర్శ
వేమనపల్లి: నాయిని కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం రాష్ట్ర నాయకులతో కలిసి గురువారం మండలంలోని మంగెనపల్లి గ్రామానికి వెళ్లి యజమాని వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కన్నయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో మాట్లాడారు. కన్నయ్య కుటుంబానికి చెందిన సీలింగ్ పట్టా భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న యజమాని చిన్నన్న కుమారుడు హరీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్, ఎస్సైలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్యకు కారకులైన యజమాని ఎనగంటి చిన్నన్నతోపాటు భార్య లక్ష్మీ, కొడుకు హరీష్‌లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 21, 22వ తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని, అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం గిరిజన సంఘం నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ రమేష్, ఎస్సై శ్యాంపటేల్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యక్షుడు పూనం సచిన్, బండారు రవికుమార్, సీపీఎం రాష్ట్ర నాయకులు ఆశయ్య, టీఏజీఎస్ రాష్ట్ర నాయకులు కోట శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాగాల రాజన్న, ఎర్మ పున్నం, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఉమారాణి, నాయకులు మల్లేశ్వరి, అబ్దుల్లా, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.