
కేజీబీవీల్లో మౌలిక వసతులు
● ఉమ్మడి జిల్లాకు రూ.7.31 కోట్లు ● పునఃప్రారంభంలోపు పనులు పూర్తి
మంచిర్యాలఅర్బన్: పేద, వెనుకబడిన, మధ్యలో బడిమానేసిన బాలికలకు విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బాగుకు ప్రభుత్వం నడుం బిగించింది. నాణ్యమైన విద్య వసతులు అందించడమే లక్ష్యంగా విద్యాలయాలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపరిచి భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.7,31,19,400 మంజూరు చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రత్యేక అధికారులు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సమన్వయంతో మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రాధాన్యత ప్రాతిపదికన పనులు, మరమ్మతులు గుర్తించనున్నారు. విద్యాలయాల పునఃప్రారంభంలోపు అన్ని పునరుద్ధరణ, మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఉత్తర్వులు రావడంతో అధికారులు పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. మూడింట్లో పదో తరగతి, 15 చోట్ల ఇంటర్మీడియెట్ వరకు తరగతులు కొనసాగతున్నాయి. ఇదివరకు 4,589 మంది బాలికలు అభ్యసిస్తున్నారు. ఇటీవల ఐదు కేజీబీవీల్లో ఇంటర్ తరగతుల నిర్వహణకు అ నుమతులు ఇచ్చారు. రెండు చోట్ల రెండు, మూడు చోట్ల ఒకే కోర్సులో ప్రవేశాలకు అవకాశం కల్పించా రు. గదుల కొరత, సౌకర్యాల లేమి నేపథ్యంలో వి ద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టనున్నారు. ఒక్కో కేజీబీవీకి రూ.4లక్షల నుంచి రూ.31లక్షల వరకు నిధులు మంజూరు కావడం ఊరటనిస్తోంది.
చేపట్టనున్న పనులు ఇవే..
ఆయా కేజీబీవీల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టనున్నారు. అంచనా వేసిన, గుర్తించిన పనులు సాగనున్నాయి. అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మాణం, అదనపు వసతిగృహాల నిర్మా ణం, అదనపు కిచెన్ షెడ్ల నిర్మాణం, క్రీడా కోర్టుల ని ర్మాణం, సెప్టిక్ ట్యాంకుల ఏర్పాటు, డ్రైనేజీ అవుట్ లెట్ల ఏర్పాటు, సోలార్ ప్యానెల్స్, ఆర్వో ప్లాంట్ల సంస్థాపన, విద్యుత్ వైరింగ్, సానిటరీ ఫిక్చర్స్, ఫిట్టింగుల పూర్తి, ఇతర ముఖ్యమైన సివిల్ లేదా ఎలక్ట్రికల్ పనులు, అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయనుండడంతో దిశ మారనుంది.
ఉమ్మడి జిల్లాలో..
జిల్లా నిధులు మంజూరు
మంచిర్యాల రూ.2,59,31,600
ఆదిలాబాద్ రూ.1,83,64,200
కుమరంభీం ఆసిఫాబాద్ రూ.1,46,52,800
నిర్మల్ రూ.1,41,70,800