
పేలిన బుష్ ఇన్సులేటర్లు
మందమర్రిరూరల్: పట్టణంలోని రెండవ జోన్ రైల్వేస్టేషన్ రోడ్డు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ బుష్ ఇన్సులేటర్లు సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా పేలి మంటలు ఎగిసిపడ్డాయి. రోడ్డు పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో ఆయిల్ రోడ్డుపై పడింది. ఆ సమయంలో రోడ్డు గుండా ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటలకు విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు కాలిపోయాయి. విద్యుత్‌శాఖ ఏఈ శ్రీనివాస్‌ను సంప్రదించగా.. బుష్ ఇన్సులేటర్లలో గ్యాస్ ఏర్పడి పేలి ఉంటుందని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూస్తామని తెలిపారు.
ట్రాక్టర్ అదుపు తప్పి యువ రైతు మృతి
నర్సాపూర్(జి): నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం నందన్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నందన్ గ్రామానికి చెందిన సామ రూపేశ్‌రెడ్డి(35) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం తన సొంత ట్రాక్టర్‌లో పొలానికి చెరువు మట్టి తరలిస్తుండగా చెరువు కట్ట మార్గంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఇంజన్ ట్రాలీ మధ్యలో రూపేశ్‌రెడ్డి ఇరుక్కు పోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
మహిళ మృతి
కాసిపేట: కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధి సోమగూడెం వారసంత సమీపాన ఉన్న సింగరేణి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ గది ఆవరణలో కుక్కల లలిత(48) మృతిచెందినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చెల్పూర్ గ్రామానికి చెందిన ఆమె సోమగూడెంలోని కుటుంబీకుల వద్ద ఉంటూ మద్యానికి బానిసైందని పేర్కొన్నారు. సోమవారం మృతదేహం కనిపించింది. మృతురాలి కూతురు పెద్దపల్లి రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.