
కాంగ్రెస్ నేతల బాహాబాహీ
● పరిశీలకుల ఎదుటే గలాట ● మాజీ కౌన్సిలర్‌పై చేయి చేసుకున్న పీసీసీ సభ్యుడు ● పోలీసుల రంగ ప్రవేశం
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశంలో నాయకులు బాహాబాహీకి దిగారు. ఇరువర్గాలు కొట్టుకునే వరకు వెళ్లారు. రాష్ట్ర పరిశీలకుల ఎదుటే మాజీ కౌన్సిలర్‌పై పీసీసీ సభ్యుడు చేయి చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. పరిశీలకులు రాష్ట్ర ఆయిల్, ఫర్టిలైజర్స్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పీసీసీ కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. ఎమ్మెల్యే, పరిశీలకులు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చాంబర్‌లోకి వెళ్లారు. అనంతరం సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బ్లాక్, మండల, పట్టణ, గ్రామ అధ్యక్షుల ఎన్నికల కోసం పరిశీలకులు చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెన్నూర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ పోగుల సతీష్ ఫిర్యాదు చేశారు. దీంతో పీసీసీ సభ్యుడు మందమర్రికి చెందిన పిన్నంటి రఘునాథ్‌రెడ్డి ఆయనతో ఘర్షణకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు తోసుకున్నారు. సహనం కోల్పోయిన రఘునాథ్‌రెడ్డి సతీష్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో చెన్నూర్ నాయకులు ఆందోళనకు దిగారు. సీఐ దేవేందర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పార్టీ పరిశీలకుల ఎదుటే నాయకులు గలాటకు దిగడంతో కాంగ్రెస్ నాయకుల తీరు మారదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
పరిశీలకులకు ఫిర్యాదు..
ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ముఖ్య అనుచరుడు రఘునాథ్‌రెడ్డి సతీష్‌పై చేయిచేసుకున్న తీరును పరిశీలకులు రాఘవరెడ్డి, రాంభూపాల్‌రెడ్డిలకు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన పీసీసీ సభ్యున్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరినట్లు రాజిరెడ్డి వర్గీయులు తెలిపారు. సమావేశంలో ఘర్షణ జరుగుతున్నా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సంఘటన స్థలానికి రాకపోవడం గమనార్హం.