తాండూర్: ఆ విద్యార్థుల ఆత్మస్థైర్యం ముందు అంధత్వం చిన్నబోయింది. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే వారి దృఢ సంకల్పం ముందు విధి తలవంచింది. మండల కేంద్రంలోని విద్యాభారతి పాఠశాలలో గౌతూరి శ్రీవిద్య, తంగెడ శ్రీమాన్ పదో తరగతి చదువుతున్నారు. గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన శ్రీమాన్, తాండూర్ కొత్త గుడిసెల ఏరియాకు చెందిన శ్రీవిద్య 70శాతం అంధత్వానికి లోనయ్యారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల వినతి మేరకు స్క్రైబ్(సహాయకుల) సహాయంతో పరీక్షలకు హాజరయ్యేందుకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతించారు. శ్రీమాన్‌కు విద్యాభారతి పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని మైలారపు తరుణి, శ్రీవిద్యకు మరో తొమ్మిదో తరగతి విద్యార్థిణి పట్టి ప్రణవి స్క్రైబ్‌గా హాజరయ్యారు. దీంతో శుక్రవారం తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తొలి రోజు పరీక్షకు హాజరై స్క్రైబ్‌ల సహాయంతో రాశారు. తనిఖీకి వచ్చిన డీఈవో యాదయ్య ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు అడిగి శ్రీమాన్, శ్రీవిద్య చెప్పిన సమాధానాలతో అభినందించారు.