ఆ శాఖలో అంతేనా? | Sakshi
Sakshi News home page

ఆ శాఖలో అంతేనా?

Published Tue, May 21 2024 2:00 AM

ఆ శాఖలో అంతేనా?

● సరెండర్లు, సస్పెన్షన్లతోనూ మారని తీరు ● గాడితప్పుతున్న జిల్లా పౌరసరఫరాల శాఖ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా పౌరసరఫరాల శాఖలో ఉన్నతాధికారులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ప్రజలకు కీలక సేవలు అందించే వాటిలో ఒకటైన ఈ శాఖ పరిధిలో అనేక అక్రమాలు, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. శాఖ ఉన్నతాధికారులపైనే విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా సరెండర్లు, సస్పెన్షన్లు జరుగుతున్నాయి. గతంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి విధుల్లో అలసత్వం వహిస్తున్నారని, ఆ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. పీడీఎస్‌ బియ్యం, మిల్లర్ల అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు తేలడంతో బదిలీ వేటు పడింది. అంతకు ముందు ఇదే శాఖ పరిధిలోనే గత కలెక్టర్‌ మరో ఉన్నతాధికారిని ‘ఆయన సేవలు మాకొద్దు’ అంటూ కమిషనర్‌కు సరెండర్‌ చేశారు. తర్వాత కొన్నాళ్లకు ఇక్కడికే మళ్లీ వచ్చి కొనసాగుతున్నారు. ఇటీవల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని విధుల్లో నిర్లక్ష్యం, శాఖ పరమైన ఆదేశాలు పాటించడం లేదంటూ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇన్చార్జీగా బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణను డీసీఎస్‌వోగా నియమించారు.

పీడీఎస్‌ నుంచి మిల్లర్ల దాకా..

ప్రతీ నెలా రేషన్‌ బియ్యం పంపిణీతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రవాణా చేయడం, ఎఫ్‌సీఐ, స్టేట్‌ కార్పొరేషన్‌కు సీఎంఆర్‌(కస్టం మిల్లింగ్‌ రైస్‌) అప్పగింత వరకు వివిధ దశల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. జిల్లాలో చాలామంది మిల్లర్లు సీజన్లు గడుస్తు న్నా సకాలంలో బియ్యం ఇవ్వడం లేదు. కోటా ప్ర కారం పౌరసరఫరాల శాఖ ధాన్యం మిల్లర్లకు అప్పగిస్తే, మరాడించి ఇవ్వాలి. కానీ టన్నుల కొద్దీ బి య్యం బకాయిలు ఉంటున్నాయి. ధాన్యం కేటా యింపులు, మిల్లుల నుంచి బియ్యం తిరిగి రాబట్ట డం పౌరసరఫరాల శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. కొందరు అధికారులు మిల్లర్లతో కుమ్మక్కయి చూసీచూడనట్లుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌ లిస్టులో పెట్టిన మిల్లులకు సైతం ధాన్యం కోటా కేటాయించడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాక రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలను సకాలంలో పాటించకపోగా, జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమయంలోనూ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం కటింగ్‌, రవాణా, మిల్లర్లు ధాన్యం పెట్టే కొర్రీలపైనా పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులపై వేటు పడుతోంది. ఇక పీడీఎస్‌(ప్రజా పంపిణీ వ్యవస్థ)లో స్జేజ్‌ వన్‌ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు అటు నుంచి డీలర్లు, చివరకు లబ్ధిదారులకు దాకా చేరే ప్రతీ నెలా అప్రమత్తంగా ఉండాలి. బియ్యం రవాణా కాంట్రాక్టర్లు, ఇన్చార్జీలు, డీలర్ల మధ్య సమన్వయపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో బి య్యం నిల్వల్లో తేడాలు వస్తున్నాయి. గతంలో ఇ న్చార్జీలు విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ క్ర మంలో జిల్లా ఉన్నతాధికారుల చొరవతో ఈ శాఖ ను గాడినపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement