
ఐక్యతను చాటుతున్న వామపక్ష పార్టీల నాయకులు
పాతమంచిర్యాల: బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక హక్కుల సాధనకు బలమైన ప్రజాపోరాటాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(చంద్రన్న వర్గం), సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో ప్రజల్లో మత కలహాలు సృష్టిస్తూ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. అయోధ్యలో రామమందిరం, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట పేరుతో ఇంటింటికీ అక్షింతలు పంపిణీ చేసి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లాల్‌కుమార్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి(చంద్రన్న వర్గం) మేకల రామన్న, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య, జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, తదితరులు పాల్గొన్నారు.