
కాన్కూర్ శివారులో వివాదాస్పదంగా ఉన్న భూములు
● నిజాం పాలనలో పంటలు పండించిన కాన్కూర్ రైతులు
● వివాదాస్పదంలో 2400 ఎకరాల భూములు
● మరో పోరాటానికి సిద్ధమవుతున్న భూ పోరాట సమితి
జైపూర్: 35 ఏళ్లుగా కాన్కూర్ రైతులు ఇక్కడి ప్రజలు మిగులు భూముల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. తమ భూములకు హక్కులు కల్పించాలని పోరాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను భూపోరాట సమితి నాయకులు తీసుకెళ్లారు. నిజాం పాలనలో అంకన్నపాడ్ చెరువు కింద వెయ్యి ఎకరాలకుపైగా భూముల్లో రైతులు పంటలు సాగు చేశారు. తాతలు, ముత్తాతల కాలంలో కాన్కూర్ శివారు భూముల్లో వ్యవసాయం చేసేవారు. 1969లో రాజపత్రం ప్రకారం సెక్షన్–4 ద్వారా కాన్కూర్ శివారు భూములు (కాన్కూర్ బ్లాక్) మొత్తాన్ని రక్షిత అటవీ ప్రాంతం పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రస్తావించింది. కాన్కూర్ శివారులో గల అప్పటి సెతువార్ పట్టాప్రకారం సర్వే నెంబర్ 132/11లో అటవీశాఖ ఆధీనంలో 2,400 ఎకరాలకు పైగా భూమి ఉంది. 1969 గెజిట్ ప్రకారం సెక్షన్–4లో ప్రస్తావించింది. వాస్తవానికి 797 ఎకరాలు మాత్రమే అంటే మిగిలిన 1,600 ఎకరాల మిగులు భూములపై కాన్కూర్ వాసులు పోరాటం మొదలైంది. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా కాన్కూర్ వాసుల తలరాతలు మాత్రం మార్చే నాథుడే కరువయ్యాడు. ఆ భూములపై ఆధారపడ్డ రైతులు..భూమి లేని పేద ప్రజలు ఏళ్లుగా మిగులు భూములపై పోరాటం చేస్తున్నారు. ఉన్నా ఊరిలో ఉపాధి కరువై పట్టణ ప్రాంతాలకు వలస కూలీగా వెళ్తున్నారు. ప్రభుత్వాలు.. పాలకులు మిగులు భూములపై దృష్టిసారించకపోవడం దశాబ్దాలుగా భూ సమస్య కొలిక్కిరాని పరిస్థితి. అటవీ–రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించినా మిగులు భూముల లెక్క తేల్చని పరిస్థితి నెలకొంది. 2008లో గ్రామసభ నిర్వహించి అటవీ అధికారులు, కాన్కూర్ గ్రామస్తులు ఆ వివాదాస్పద భూములపైకి వెళ్లకూడదని నిర్ణయించి జాయింట్ సర్వే నిర్వహించినా తర్వాత మిగులు భూములు తేలుస్తామని అప్పటి ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు. 14 ఏళ్లు గడుస్తున్నా సమస్య కొలిక్కి రాలేదు. కాన్కూర్ బ్లాక్‌పై కన్నేసిన అటవీశాఖ భూముల్లో అటవీ అభివృద్ధి పనులు చేపట్టడం కాన్కూర్ వాసులు అడ్డగించడంతో రాష్ట్రస్థాయికి కాన్కూర్ భూ సమస్య చేరింది. గత ప్రభుత్వం పట్టింపు చేయకపోవడంతో సమస్య కొల్కిరాకపోగా, మరో ఉద్యమానికి కాన్కూర్ భూ పోరాట సమితి సిద్ధమవుతోంది.
కాన్కూర్ వాసుల తలరాతమరేనా..
కాన్కూర్ గ్రామస్తులు మిగులు భూముల కోసం 35 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. గ్రామశివారులో 132 పీపీ, 132–11, 106, 107, 139 సర్వే నెంబర్‌లో సుమారు 1,600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గ్రామంలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వంద మందికిపైగా ఈ భూముల్లో పట్టాలు సైతం ప్రభుత్వం ఇచ్చింది. అయితే భూ వివాదం నెలకొనడం ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రభుత్వ భూమి తేల్చి భూమి లేని పేదలకు పంపిణీ చేయాలని ఇక్కడి ప్రజల ప్రధాన డిమాండ్. తాతలు, ముత్తాతల కాలంలో ఆ భూముల్లో పంటలు సాగు చేశారని నేటికి అక్కడ అనవాళ్లు ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఏళ్లుగా అటవీ అధికారులు గ్రామస్తులకు మధ్య వివాదం నడుస్తోంది. గ్రామస్తులపై కేసులు పెట్టినా వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
1969 గెజిట్ ప్రకారం సెక్షన్–4లో ప్రస్తావన..
కాన్కూర్ శివారులో గల సర్వేనెంబర్ 132/11లో 1,481 ఎకరాల భూమి ఉండగా 1969 గెజిట్ ప్రకారం సెక్షన్–4 ద్వారా 797 ఎకరాల భూమిని రక్షిత అటవీ ప్రాంతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రస్తావించింది. సర్వే నెంబర్ 132/11 ఉన్న 1,481 ఎకరాల్లో కేవలం 797 ఎకరాలు మాత్రమే సెక్షన్–4 లో ప్రస్తావించగా అందులో మిగులు భూమితోపాటు సర్వే నెంబర్ 132(పీపీ) 982 ఎకరాలు, 106లో 24 సెంట్లు, 107లో 36 సెంట్లు, 136లో నాలుగెకరాల 22 సెంట్లు అటవీశాఖ ఆధీనంలో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వాస్తవానికి ఇందులో నైజాం కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మురళీ మనోహర్‌రావుకు 70 ఎకరాలు పట్టా భూమి ఉంది. సెక్షన్–4లో ప్రస్తావించిన భూమి పోగా మిగులు భూమి పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం సెక్షన్–4, సెక్షన్–15తో సమానమని అటవీప్రాంతంలో పట్టా భూములు ఉంటే ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి ఆ భూములను అటవీశాఖకు అందినట్లుగా చెబుతున్నారు.
పోరాటం చేస్తాం
కాన్కూర్ మిగులు భూముల కోసం పోరాటం చేస్తాం. వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉన్నా ఇక్కడి రైతులు, ప్రజలకు ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. మరో పోరాటానికి సిద్ధం అవుతున్నాం. మిగులు భూములు సాధించేవరకు పోరాటం చేస్తాం.
– బత్తుల శ్రీనివాస్‌యాదవ్, కాన్కూర్
భూ పోరాట సమితి అధ్యక్షుడు
