‘కృష్ణా జలాల్లో జిల్లాకు అన్యాయం చేస్తే ఉద్యమం’ | - | Sakshi
Sakshi News home page

‘కృష్ణా జలాల్లో జిల్లాకు అన్యాయం చేస్తే ఉద్యమం’

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉమ్మడి పాలమూరు జిల్లాకు కృష్ణా జలాల్లో దక్కాల్సిన నీటివాటాలో అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల విరివిగా విడుదల చేయాలని కోరారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల రిజర్వాయర్‌ నుంచి 0.5 టీఎంసీల నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీలకతీతంగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రాజెక్టుల పూర్తికి కృషిచేయడానికి ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పాలకుల నిర్లక్ష్యానికి గురైందని, దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు శాపంగా మారిందన్నారు. ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు.. కాని డిండికి నీటితరలింపును అడ్డుకుంటామనే నినాదంతో ముందుకు పోవాలన్నారు. డిండి లిఫ్ట్‌కు బదులుగా గొట్టిముక్కుల ఎత్తిపోతలను చేపట్టాలన్నారు. పాల మూరు జిల్లాను కరువు రహితంగా మార్చేందుకు సీఎం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు రాఘవచారీ, బెక్కం జనార్దన్‌, చెన్నకిష్టన్న, పరమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement