సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

సోమశిల అందాలు

నల్లమ అందాలు తిలకిస్తూ జలజల పారుతున్న కృష్ణానదిలో బోటు ప్రయాణం చేయాలంటే నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలకు వెళ్లాల్సిందే. సప్తనదుల సంగమం, పురావస్తు మ్యూజియం ఉన్నాయి. కృష్ణానది మధ్యలో ఉండే మహాభారత కాలం నాటి సంగమేశ్వరాలయం ఇక్కడే ఉంది. కొల్లాపూర్‌ నుంచి సోమశిల 9 కిమీ. ఆర్టీసీ బస్సులు, వాహనాలు అందుబాటులో ఉంటాయి. నాగర్‌కర్నూల్‌ నుంచి 57కిమీ, మహబూబ్‌నగర్‌ నుంచి 100కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆధ్యాత్మికం కురుమూర్తి దేవాలయం

అలంపూర్‌కు ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పురాతన ఆలయాలు, శిల్పకళా ఖండాలు ఇక్కడి ప్రత్యేకత. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం ఇక్కడే ఉంది. బాలబ్రహ్మేశ్వరస్వామి, నవబ్రహ్మ ఆలయాల సముదాయాలతో ఆధ్యాత్మికత ఇక్కడ వెల్లివిరుస్తోంది. అలంపూర్‌ క్షేత్రం మహబూబ్‌నగర్‌ నుంచి 125 కిలోమీటర్లు ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో మరో ప్రముఖమైన క్షేత్రం కురుమూర్తి దేవాలయం. అమ్మాపూర్‌ సంస్థానాదీశులు ఈ ఆలయాన్ని కట్టించారు. శిలారూపం దాల్చి ప్రత్యక్షరూపంలో కురుమూర్తి రాయుడిగా భక్తులతో విశేష పూజలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత ఇక్కడ జరిగేదే పెద్దది. మహబూబ్‌నగర్‌ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement