చిన్నచింతకుంట: రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధి తమ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కురుమూర్తిస్వామి ఆలయాన్ని విస్మరిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడిగిన వెంటనే రూ.110 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. బుధవారం కురుమూర్తిస్వామి ఆలయ నూతన పాలక మండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితోపాటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమూర్తిస్వామి తమ ఇంటి ఇలవేల్పు అని, స్వామివారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానని, ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తాన్నారు. యాదాద్రి తరహాలో ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచే కాకుండా దాతల సహకారంతో నిధులు రాబట్టి అభివృద్ధి పనులు కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిధులతో ఘాట్ రోడ్డు నిర్మాణం, రాజగోపురం వద్ద రేకుల షెడ్డు పనులు చేపడుతున్నామన్నారు. స్నేహ చికెన్ కంపెనీ సహకారంతో ప్రధాన ఆలయం వద్ద మహామండపం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. నూతన పాలక మండలి బాధ్యతాయుతంగా పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి వెళ్లలేని భక్తులు కురుమూర్తిస్వామిని దర్శించుకుంటున్నారని చెప్పారు. తిరుమల మాదిరిగానే కురుమూర్తిలోనూ అన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు.
కురుమూర్తిస్వామి ఆలయ నూతన పాలక మండలి చైర్మన్‌గా చిన్నచింతకుంట గ్రామానికి చెందిన బత్తుల బాలరాజు నియమితులయ్యారు. ఆయనతోపాటు సభ్యులుగా 13 మంది వేగనాథ్, మహిపాల్‌రెడ్డి, శ్రీశంకర్, భరత్‌కుమార్‌రెడ్డి, వడ్డె శ్రీను, మహేందర్, అర్జున్, తిరుపతయ్య, ప్రేమ్‌సాగర్, తిరుపతిరెడ్డి, మున్నూరు బాలరాజు, భాస్కరాచారి, సౌజన్య, ఎక్స్‌అఫీషియల్ మెంబర్ శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం పాలక మండలి సభ్యుల చేత అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈఓ మదనేశ్వరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొలువుదీరిన పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, దేవరకద్ర, మదనాపురం మార్కెట్ కమీటీ చైర్మన్లు ప్రశాంత్, కథలప్ప, కురుమూర్తిస్వామి ఆలయ మాజీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, అప్పంపల్లి పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, అమ్మాపురం, కురుమూర్తి, గూడూరు సర్పంచులు రంజిత్, కుర్మన్న, భీమన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి ఆలయ తరహాలో
తీర్చిదిద్దేందుకు కృషి
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వెల్లడి
కొలువుదీరిన నూతన పాలక మండలి


