అప్పు ఇవ్వలేదనే హత్య | - | Sakshi
Sakshi News home page

అప్పు ఇవ్వలేదనే హత్య

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మండలంలోని ఖాజీపూర్‌లో మూడు రోజుల క్రితం జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించి నిందుతుడిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం నారాయణపేట డీఎస్పీ లింగయ్య మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మహ్మద్‌ ఖాజా అతని సడ్డకుడు హైమద్‌ను రూ.5 లక్షలు అప్పుగా ఇవ్వమని అడగగా అతను తిరస్కరించడంతో ఇరువురి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీనిని మనస్సులో పెట్టుకున్న ఖాజా హైమద్‌ను హత్యచేసి, అతని భార్య, ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని భావించి ముందుగా పథకం రచించాడు. ఈ క్రమంలోనే గత నెల 27న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఖాజీపూర్‌ శివారులోని తన పొలం వద్ద కొత్తగా నిర్మిస్తున్న కోళ్ల షెడ్డు దగ్గర ఒంటరిగా ఉన్న హైమద్‌(42)పై దాడి చేసి సిమెంట్‌ పెల్లలు, రాళ్లతో ముఖం, తలపై తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందుతుడు ఘటనా స్థలం నుంచి బైక్‌పై పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖాజాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్య చేయడానికి ముందు అతని దగ్గరున్న వస్తువులు మోటార్‌సైకిల్‌, సెల్‌ఫోన్‌, రక్తపు మరకలు గల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండుకు తరలించామని డీఎస్పీ లింగయ్య తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో కేసును ఛేదించిన కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ విజయభాస్కర్‌, కోస్గి ఎస్‌ఐ బాలరాజు, ఉమెన్‌ ఎస్‌ఐ రేవతి, ఏఎస్‌ఐ బాలయ్య, హెచ్‌సీలు పెంటయ్య, గోపాల్‌ తదితరులను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ చేత రివార్డు అందిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement