‘మహాలక్ష్మి’తో మహిళా సాధికారిత | - | Sakshi
Sakshi News home page

‘మహాలక్ష్మి’తో మహిళా సాధికారిత

Apr 1 2026 10:59 AM | Updated on Apr 1 2026 10:59 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహిళల ఆర్థిక, సామాజిక భద్రతతోపాటు సాధికారితకు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఎంతో దోహదపడుతోందని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. 2026 మార్చి 29 నాటికి సుమారు 290 కోట్ల మహిళల ప్రయాణాలు నమోదు కావడంతో రూ.10 వేల కోట్లు బస్సు చార్జీల ఆదా రూపంలో ప్రయోజనం చేకూరిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలు, పట్టణాలు, నగరాలకు చేరుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యావకాశాలు పొందుతున్నారని చెప్పారు. ఈ సౌకర్యం ద్వారా వారు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయం పెంచుకుంటున్నారని, దీని వలన ఆర్థికంగా బలపడటమే కాకుండా సామాజికంగా, విద్యాపరంగా కూడా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. మేయర్‌ మమత మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తాను మేయర్‌గా ఎన్నికవడం కూడా మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం అన్నారు. ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 10 డిపోల్లో 960 ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందుతున్నారన్నారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.1,064 కోట్ల బస్సు చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 100 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, కొత్త రూట్లలో బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్న కొంతమంది మహిళలు తమ అనుభవాలు పంచుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నర్సింహులు, డిప్యూటీ ఆర్‌ఎంలు లక్ష్మీధర్మ, కవిత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వాతి, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement