● వివాహేతర సంబంధమే కారణంగా గుర్తించిన పోలీసులు
● ఇద్దరు నిందితులకు రిమాండ్
ఖిల్లాఘనపురం: మండలంలోని రోడ్డుమీదితండా సమీపంలో మొల్గర శేషమ్మను హత్యచేసి కాల్వలో వేసిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించిన కొత్తకోట ఇన్‌చార్జి సీఐ రత్నం, ఖిల్లాఘనపురం ఎస్‌ఐ వెంకటేష్ విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన మొల్గర నిరంజన్ భార్య మొల్గర శేషమ్మ(55)కు అదే గ్రామానికి చెందిన మొల్గర కృష్ణయ్య వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరు గ్రామం నుంచి వెళ్లిపోయి మహబూబ్‌నగర్‌లోని కుమ్మరివాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా మొల్గర శేషమ్మ అక్కడ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు కృష్ణయ్యకు అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కృష్ణయ్య ఈ నెల 22న అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుని చేతులతో గొంతునులిమి చీరలతో గొంతుకు బిగించి చంపాడు. అనంతరం మరుసటి రోజు ఉదయం తనకు తెలిసిన మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని టీడీగుట్టలో ఉంటున్న ముచ్చింతల కురుమూర్తిని ఆటో తీసుకుని రావాలని పిలిచాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ఆటోలో వేసుకుని మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్, వెల్కిచెర్ల, మామిడిమాడ, పర్వతాపురం మీదుగా ఖిల్లాఘనపురం చేరుకున్నారు. అక్కడి నుంచి తిర్మలాయపల్లి రెవెన్యూ శివారులో రోడ్డుమీదితండా సమీపంలో హనుమాన్‌కత్వ కుంట దగ్గర నీళ్లు లేని కాల్వలో మృతదేహాన్ని పడేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు చెప్పారు. తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన మొల్గర శేషమ్మగా గుర్తించగా.. ఆమె కుమారుడు మొల్గర కుర్మయ్య అనమానాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య చేసి చంపిన మొల్గర కృష్ణయ్య, సహకరించిన ముచ్చింతల కురుమూర్తిలను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో వారిని వనపర్తి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితులను గుర్తించి పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్‌ఐ వెంకటేష్, కానిస్టేబుళ్లు లింగం, రాజు, చైతన్యకుమార్, మునావర్‌లను సీఐ అభినందించారు.


