కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చంద్రవంచలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు చంద్రవంచ గ్రామానికి చెందిన పటేల్ కృష్ణయ్య ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఈ క్రమంలో కృష్ణయ్య మొదటి కుమారుడు పటేల్ రమేష్ (16) ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర కాలుజారి పక్కనే ఉన్న కరెంట్ బుడ్డి ఎర్తింగ్ వైర్‌పై పడిపోయాడు. దీంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు.
మనస్తాపంతోయువకుడి ఆత్మహత్య
వనపర్తి రూరల్: మండలంలోని రాజనగరం చెందిన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ హృశికేష్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నక్క రాకేష్(20) మూడు రోజుల క్రితం పాన్‌గల్ గ్రామంలో అతని తాత మృతి చెందాడు. అప్పటి నుంచి మనస్తాపంతో అన్నం తినకుండా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం
చారకొండ: మండల కేంద్రానికి చెందిన మునగాల లోకేశ్(45) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి లోకేశ్ నూనె తయారీ చేసే దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం దుకాణంలో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కేఎల్‌ఐ కాల్వలోపడి వ్యక్తి మృతి
తిమ్మాజిపేట: మండల పరిధిలోని ఆవంచ గ్రామ సమీపంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడి గొల్కోండ వసంత్ (50) అనే వ్యక్తి మృతి చెందినట్లు గ్రామ స్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు కేఎల్‌ఐ కాలువ నుంచి పంటలకు నీరు పారించేందుకు కొందరు రైతులు కాలువలో మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో కాలువలో ఎక్కువగా నాచు ఉండడంతో బోరు మోటార్లు పనిచేయక పోవడంతో వసంత్‌తో మరమ్మతు చేయించేవారు. ఈక్రమంలో శుక్రవారం ఓ రైతుకు చెందిన మోటార్ పనిచేయకపోవడంతో మరమ్మతు చేసేందుకు వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. రైతులందరూ కలిసి గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


