వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

Mar 28 2026 10:32 AM | Updated on Mar 28 2026 10:32 AM

పవిత్ర ఘట్టాన్ని తిలకించి తరించిన భక్తులు

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిఏడాది శ్రీరామనవమికి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ పవిత్ర ఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహిళల మంగళహారతులు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తజనావళి తిలకిస్తుండగా.. పురోహితుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం గావించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. దీంతో మన్యంకొండ భక్తులతో కిటకిటలాడింది. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఆళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement