చేతికి చిక్కులు..!
పాలమూరు: టికెట్ ఆశించి భంగపడిన ఆశావహుల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి నిరసన సెగ తగులుతోంది. అనేక డివిజన్ల నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వలాలు ఎగిసిపడ్డాయి. కొందరు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం మధ్యాహ్నం డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేశారు. ఆయా డివిజన్లలో టికెట్ ఆశించి.. తుది జాబితాలో పేరు లేకపోవడంతో ఆశావహులు ఒక్కొక్కరు డీసీసీ కార్యాలయానికి చేరుకొని.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పలువురు నేతలు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 30వ డివిజన్‌కు చెందిన పలువురు మాజీ కౌన్సిలర్ షేక్ ఉమర్ భార్యకు టికెట్ కేటాయించాలని ఆందోళన చేశారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌ను చుట్టుముట్టారు. కొత్వాల్‌తో పలువురు నాయకులు వాగ్వివాదానికి దిగారు. జిల్లా నేతలకు వ్యతిరేకంగా డౌన్‌డౌన్ నినాదాలు చేశారు. తమ నేతలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదని కార్యకర్తలు గట్టిగా ప్రశ్నించారు. అలాగే 1వ డివిజన్ నుంచి మేఘ్యనాయక్‌కు టికెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో డీసీసీ కార్యాలయానికి తరలివచ్చి నిరసన తెలిపారు. 45వ డివిజన్‌లో కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్ని, పార్టీ బలోపేతం కోసం పని చేసిన సల్మాన్ షరీఫ్‌కు టికెట్ కేటాయించకపోవడంతో ఆ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. 39 డివిజన్ నుంచి తమకు టికెట్ కేటాయించలేదని మరో అభ్యర్థి అవేదన వ్యక్తం చేశాడు.
ఏఐసీసీ కార్యదర్శికి విన్నపాలు
టికెట్లు దక్కని పలు డివిజన్లకు చెందిన ఆశావహుల అనుచరులు కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్లుకు విన్నవించారు. డీసీసీ చాంబర్‌లో ఆయన నాయకులతో సమావేశమయ్యారు. పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నారని, వారికి టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మొదటి విడతలో టికెట్ల కేటాయింపులు అన్యాయం జరిగిందని సరిచేయాలని కోరారు. రెండో విడత జాబితాలో తమకు టికెట్లు కేటాయించాలని కోరారు.
అధికార పార్టీలో రె‘బెల్స్’ గుబులు
పలు డివిజన్లలో సంతృప్తి రాగాలు
కార్పొరేషన్‌లో 36 మందితో కూడిన తొలి జాబితా విడుదల
డీసీసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన టికెట్లు రాని ఆశావహులు
చేతికి చిక్కులు..!


