డివిజన్లు, వార్డుల వారీగా చిట్టా తీసిన పోలీసులు
● ఎన్నికల వేళ పాత నేరస్తుల కదలికలపై దృష్టి
● జిల్లాలో రౌడీషీటర్ల సమాచార సేకరణ
● నగరంలో 42 మంది పాత నేరస్తులుబైండోవర్
మహబూబ్‌నగర్ క్రైం: కార్పొరేషన్/మున్సిపల్ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మేయర్/చైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా రోజురోజుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి. ప్రచార వ్యయాలను లెక్క చేయకుండా అత్యధిక డివిజన్లు/వార్డుల్లో గెలుపే లక్ష్యంగా సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీస్‌శాఖ సన్నద్ధం అవుతోంది. శాంతిభద్రతలు గాడి తప్పకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా సాంకేతికతను వినియోగించుకోనున్నారు. అవసరం మేరకు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నట్లు సమాచారం. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా పోలీసులు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల్లో రౌడీషీటర్లు, నేరప్రవృత్తి గల వారు దౌర్జన్యాలు, గొడవలకు కారణమవుతుంటారు. ఇలాంటి వారిని జిల్లా పోలీసులు ముందుగానే గుర్తించి వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ను నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీల తరఫున నజరానాలు అందించడం తదితర అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడానికి జిల్లావ్యాప్తంగా నిఘాను కొనసాగించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో మూడంచెల విధానం అమలు చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయటానికి ఏర్పాట్లు చేశారు.
వార్డుల వారీగా సమాచారం..
నగరంలో 60డివిజన్లతో పాటు దేవరకద్రలో 12 వార్డులు, భూత్పూర్‌లో 10 వార్డులలో ఉన్న పాత నేరస్తులు, రౌడీషీటర్ల సమాచారంపై ఇప్పటికే లెక్కలు తీశారు. పోలీసులు వార్డుల వారీగా సమాచారం సేకరించడంతో పాటు సామాజిక వర్గాల వారీగా ఓటర్లు, హద్దులు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల వివరాలతో పాటు స్వతంత్రుల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఎన్నికలు జరిగే సమస్యాత్మక డివిజన్, వార్డులలో సీసీ కెమెరాల ద్వారా పని తీరును పరిశీలించడానికి కసరత్తు చేస్తున్నారు. గతంలో వార్డుల పరిధిలో ఏమైనా ఘటనలు జరిగాయా అనే సమాచారం సిద్ధం చేశారు. దీని ఆధారంగానే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయి. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టే అవకాశాలున్నాయి.
● నగరంతో పాటు పట్టణాల్లోని పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. గతంలో ఎన్నికల సందర్భంగా అల్లర్లకు కారకులైన వారిని అవసరమైతే బైండోవర్ చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు వార్డుల్లో బెల్ట్ దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక వార్డులపై కలెక్టర్, ఎస్పీ స్థాయిలో జరిగిన సమావేశంలో చర్చించారు.
పోలింగ్‌కేంద్రాలు 320
జనవరి 27 నుంచి సీజ్ చేసిన మద్యం 37.21 లీటర్లు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 190
ఎస్పీ కార్యాలయంలో డిపాజిట్ చేసిన గన్స్ 25
బైండోవర్లు 42
ఎస్‌ఎస్‌టీ బృందాలు 4
4 చెక్‌పోస్టులు ఏర్పాటు
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటానికి జిల్లా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బయటి ప్రాంతాల నుంచి నగదు, మద్యం సరఫరా కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా సరిహద్దు జిల్లాల పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో రెండు, భూత్పూర్, దేవరకద్రలో ఒక్కో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
డివిజన్లు, వార్డుల వారీగా చిట్టా తీసిన పోలీసులు


