వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి
● మనిషి మనుగడకు ప్రకృతి అవసరం
● రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: సమాజంలో మనిషిగా మన కర్తవ్యాలను నిర్వహించే క్రమంలో ప్రకృతిని కాపాడుతూ వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విజ్ఞానదర్శిని, నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమాన్ని జేపీఎన్‌సీఓ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం స్వావలంబనకు శాసీ్త్రయ దృక్పథం, ఆధునిక భారత్, నెహ్రూ దార్శనికత అనే అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. జనవరి 27న ప్రారంభమైన యాత్ర ఈ నెల 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ జన్యుపరంగా మానవుడికి కులమతాల భేదం లేదని, అవి మనం సృష్టించుకున్నవే అని పేర్కొన్నారు. ప్రకృతిని వైజ్ఞానికంగా పరిశీలించడం ద్వారానే సైన్స్ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకృతిని తనను తాను కాపాడుకోగలదని, మనిషిగా మనం మనుగడ సాధించాలంటే ప్రకృతి ఉండాల్సిన అవసరముంది. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డా.గుమ్మడి వెన్నెల, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రముఖ గేయ రచయిత జయరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్‌రెడ్డి, జన విజ్ఞాన వేదిక డా.రమేశ్, జేపీఎన్‌సీఓ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ లింగం నాయక్, సీపీఎం నాయకులు కిల్లెగోపాల్, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


