నిబంధనల ప్రకారమే గుర్తుల కేటాయింపు
● కలెక్టర్ విజయేందిర బోయి
● ఆర్‌ఓలకు ఒక రోజు శిక్షణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు నిబంధనల ప్రకారమే గుర్తులు కేటాయించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్‌ఓలకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వివిధ రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఆయా గుర్తులను కేటాయించాల్సి ఉంటుందన్నారు. డివిజన్లు/ వార్డుల వారీగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే వారందరూ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ) హ్యాండ్‌బుక్కును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిబంధనల ప్రకారమే ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ట్రైనీ నోడల్ అధికారి, డీఈఓ ప్రవీణ్‌కుమార్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి, సీఎంఓ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


