సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టాలి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. నగరంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శనివారం రాత్రి ఎస్పీ పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లు అవసరం అవుతాయని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు కీలకంగా వ్యవహరించాలన్నారు. నగరంతో పాటు ఇతర రెండు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటికి అనుగుణంగా బందోబస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పటి నుంచే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేన నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ముందు నుంచే గస్తీ పెంచాలని, అ సాంఘిక కార్యకలాపాలపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా సిబ్బంది కేటాయింపులు, వాహనాల తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టడం వంటి చర్యలు ముందుగానే చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి జరగకుండా గమనించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య పాల్గొన్నారు.


