హనుమత్ వాహనంపై వేంకటేశ్వరుడు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్ వాహన సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామచ్చరణల మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు హనుమత్ వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే ప్రభోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవను చూసి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.
హనుమత్ వాహనంపై వేంకటేశ్వరుడు


