ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు
దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించడమే పోలీసు శాఖ ముఖ్య లక్ష్యం అని ఎస్పీ జానకి తెలిపారు. దేవరకద్రలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పక్రియలో భాగంగా గురువారం ఆమె నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, వంద మీటర్ల దూరంలో ఎలాంటి గుంపులు ఉండరాదని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాలలో ప్రవేశించే వ్యక్తుల సంఖ్య ఎన్నికల నిబంధన ప్రకారం ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రజలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఆమె వెంట భూత్పూర్ సీఐ రామకృష్ణ, దేవరకద్ర ఎస్‌ఐ నాగన్న, మున్సిపల్ కమిషనర్ నరేష్‌బాబు ఉన్నారు.


