నోడ్యూ.. సర్టిఫికెట్‌కు పోటెత్తిన ఆశావహులు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆస్తి, నీటి పన్ను క్లియర్స్ సర్టిఫికెట్ (నో డ్యూ) పొందేందుకు పోటీచేసే అశావహులు, వారి అనుచరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి 6:30గంటల వరకు ఆశావహులు, వారి సంబంధీకులు కార్యాలయంలో అటు, ఇటు పరుగులు తీసిన అధికారులంతా హడావిడిగా కనిపించడంతో నోడ్యూస్ సర్టిఫికేట్‌కు కార్యాలయానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, స్వతంత్రుల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆఫీసర్ సాయిలు, డీఈ యూనుస్, శానిటరీ ఇన్స్‌ఫెక్టర్ ఉమా మహేశ్వర్‌రెడ్డి వారివారి చాంబర్‌లో బిజీగా ఉండడంతో మున్సిపాలిటీలోని వార్డు ఆఫీసర్‌లు, ఇతర అధికారులు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో నో డ్యూస్ సర్టిఫికేట్ పొందేందుకు కార్యాలయంలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. సమస్య తీవ్రతరం కావడంతో అసిస్టెంట్ ఎన్నికల అధికారి రాత్రి 7:15గంటలకు అధికారులను అప్రమత్తం చేశారు. వార్డులవారీగా నో డ్యూస్ సర్టిఫికేట్‌లను అటెండర్ ద్వారా పురపాలికలో పనిచేసే అన్నివార్డు ఆఫీసర్‌లకు అందజేసి ఆశావహులు సంప్రదిస్తే అందించాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఆదేశించారు. కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ లేకపోవడంతో వార్డులవారీగా వార్డు ఆఫీసర్‌లకు ఇచ్చిన నోడ్యూస్ సర్టిఫికేట్‌ల జారీలో అధికారుల అలసత్వంపై ఆశావహులు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని కొత్తకోట, పెబ్బేర్, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీలో నోడ్యూస్ సర్టిఫికేట్‌కు ఆశావహులు పరుగులు తీశారు.
ఎన్నికల నిబంధనలు ఏమిటి?
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహులు కమిషనర్ చాంబర్‌కు పరుగులు తీశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఏ పత్రాలు తెచ్చుకోవాలనే విషయాలను అడిగేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి అడిగారు. జనరల్ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం లేకపోయినా ఫర్వాలేదు.. కానీ రిజర్వుడ్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తెచ్చుకోవాలని, ప్రతి అభ్యర్థి వెంట నామినేషన్ వేసేందుకు ఇద్దరికి అవకాశం ఇస్తామని చెప్పారు.


