ముగిసిన లక్ష్మీచెన్నకేశవుడి జాతర
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఉదయం వేదపండితుల మంత్రోచ్ఛారణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో నిత్యహోమం జరిపించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజావరోహణం చేసి ఆలయ ప్రాంగణంలో స్వామి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించి చక్రతీర్థసేవ జరిపించారు. వీటితోపాటు ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగం, నాగబలి, దేవతోద్వాసన, సప్తవర్ణ సేవలు నిర్వహించారు. ఉత్సవాలు ముగిసినప్పటికీ భక్తులు మాత్రం స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ఆయా ప్రభుత్వశాఖల అధికారులు, గ్రామస్తులు, ఆలయ సిబ్బందికి ఈఓ దీప్తిరెడ్డి, సర్పంచ్ గిరిప్రసాద్‌యాదవ్ కృతజ్ఙతలు తెలిపారు.
ముగిసిన లక్ష్మీచెన్నకేశవుడి జాతర


