రాష్ట్రపతికి వందన సమర్పణలో ‘పాలమూరు బిడ్డ’
మహబూబ్‌నగర్ రూరల్: ఢిల్లీలో దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటేవిధంగా నిర్వహించబడిన 77వ గణతంత్ర వేడుకల్లో పాలమూరుకు మరో గర్వకారణం దక్కింది. వేడుకల్లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ముకు వందన సమర్పణ చేసిన త్రివిధ దళాల కమాండెంట్ల బృందంలో మహబూబ్‌నగర్ జిల్లా కోడూర్‌కు చెందిన సురేశ్ పాల్గొనడం విశేషంగా నిలిచింది. పదాతి దళానికి చెందిన సురేశ్ జూనియర్ కమాండెంట్ ఆఫీసర్‌గా 25ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్నాడు. ఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ వేళ రాష్ట్రపతికి త్రివిధ దళాలు అభివందనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పదాతి దళం, నౌకాదళం, వాయుసేన జవానులు పాల్గొంటారు. ఈ ప్రతిష్టాత్మక వందన సమర్పణలో పాలమూరు జిల్లాకు చెందిన సైనికుడు సురేశ్ భాగస్వామి కావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా మారింది.
ఢిల్లీ భారత్ పర్వ్‌లో
కల్వకుర్తి యువకుడు
కల్వకుర్తి రూరల్: గణతంత్ర వేడుకల్లో భాగంగా ఎరక్రోట వద్ద తెలంగాణ జానపద ముత్యాల వైభవం ప్రదర్శించే అవకాశం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్లకు చెందిన తాడేం భరత్‌కుమార్‌కు లభించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎరక్రోట వేదికగా సోమవారం నుంచి ఈనెల 31 వరకు భారత్ పర్వ్ 2026కు తాడెం భరత్‌కుమార్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులు, కలలు, వారసత్వాన్ని చాటిచెప్పే విధంగా భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా భరత్ విలేకరులతో మాట్లాడుతూ.. దేశ రాజధానిలో ఎరక్రోట వద్ద జరిగే సంబురాల్లో ప్రతిభ ప్రదర్శించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంబురాల్లో రాష్ట్ర విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఒక అవకాశం లభించిందని చెప్పారు. తెలంగాణ మట్టి వాసన, కళా వైభవాన్ని ఢిల్లీ వీధుల్లో ప్రతిబింభించేలా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. భరత్ ఎంపికపై పలువురు సంతోషం వ్యక్తం చేయడంతోపాటు శుభాకాంక్షలు చెప్పారు.
రాష్ట్రపతికి వందన సమర్పణలో ‘పాలమూరు బిడ్డ’


