ట్రిపుల్‌ఐటీ కల నిజం చేసేందుకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీ కల నిజం చేసేందుకు ఉచిత శిక్షణ

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

ట్రిపుల్‌ఐటీ కల నిజం చేసేందుకు ఉచిత శిక్షణ

ట్రిపుల్‌ఐటీ కల నిజం చేసేందుకు ఉచిత శిక్షణ

అర్హత పరీక్ష ద్వారా 150 మంది విద్యార్థుల ఎంపిక

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థిక పరిమితుల వల్ల ట్రిపుల్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేకపోతున్న విద్యార్థులకు నాణ్యమైన ఉచిత ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బోయపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైటీసీ భవనంలో విద్యార్థులకు నెల రోజుల పాటు రెసిడెన్షియల్‌ ప్రత్యేక శిక్షణ అందజేస్తామని తెలిపారు. రూ.200 కోట్లతో ట్రిపుల్‌ఐటీ భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 17న భూమిపూజ చేసినట్లు వివరించారు. గతేడాది ట్రిపుల్‌ఐటీలో ఉమ్మడి జిల్లా నుంచి 5 శాతం విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందలేకపోయారన్నారు. కనీసం ఈ ఏడాది 15 నుంచి 20 శాతం విద్యార్థులు సీట్లు సాధించాలనే ఉద్దేశంతో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌, వందేమాత్రం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈనెల 10న నగరంలోని మాడ్రన్‌ స్కూల్‌లో మెరిట్‌ అర్హత పరీక్ష నిర్వహించామని, జిల్లా పరిధిలోని 17 మండలాల నుంచి 750 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. వీరిలో మెరిట్‌ ఆధారంగా 150 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి 75, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి మరో 75 మంది ఎంపికై నట్లు చెప్పారు. ఈ విద్యార్థులకు ఈనెల 27వ తేదీ నుంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వసతి, భోజన వసతులు అన్ని ఉచితంగానే కల్పిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలకు రూ.30 కోట్లు, బాలుర జూనియర్‌ కళాశాలకు రూ.7.95కోట్లు, బాలికల జూనియర్‌ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.6.86 కోట్లు, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల అదనపు తరగతి గదుల కోసం రూ.2కోట్లు మంజూరు చేయించామన్నారు. సమావేశంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, వందేమాతరం ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ రవీందర్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, గుండా మనోహర్‌, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement