అనాథలకు బాలసదన్ ఓ ఇల్లు: ఎంపీ
మహబూబ్‌నగర్ రూరల్: మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్ మెట్టుగడ్డలోని స్టేట్‌హోమ్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.34 కోట్ల నిధులతో బాలికల కోసం నూతనంగా నిర్మించిన బాలసదన్ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనాథ పిల్లలకు బాలసదన్ ఒక ఇంటిలా మారుతుందని, ఇక్కడ వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా బాలికలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, బాలసదన్‌ల ద్వారా వారికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్య పరీక్షలు, విద్య అందిస్తూ భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తున్నామని అన్నారు. అనాథ పిల్లల దత్తత ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తూ వారికి కొత్త కుటుంబాలు లభించేలా కృషి చేస్తున్న జిల్లా సంక్షేమశాఖ సిబ్బందిని ఎంపీ అభినందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి బాలసదన్‌లో చేర్చి, వారికి ఆహారం, ఆరోగ్యం, విద్య అందించి వారి స్వర్ణ భవిష్యత్‌కు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ బాలసదన్‌లోని పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా సంరక్షణ అందించాలని ఆదేశించారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ డీకే అరుణ బాలసదన్ పిల్లలతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామచంద్రం, శిశుగృహ మేనేజర్ గణేష్‌బాబు, బీజేపీ జాతీయ కౌన్సిల్‌మెంబర్ పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కృష్ణవర్ధన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


