పగిడ్యాల్‌లో.. ‘కృష్ణతాత’
● ప్రతిఇంటా ఆయన పేర్లే..
● భక్తుల కోరికలు తీర్చే దైవంగా నమ్మకం
● కొనసాగుతున్న కృష్ణబ్రహ్మేంద్రస్వామి జాతర
గండేడ్: గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం కృష్ణతాత మయంగా మారింది. ఇంటింటా ఆయన పేర్లే ఉన్నాయి. భక్తుల కోరికలు తీర్చే దైవంగా ఆయనను కొలవడంతోపాటు తమపేర్లు కూడా ఆయన పేరు పెట్టుకొని ఏ ఆపద వచ్చినా తమను వెన్నంటి ఉంటాడని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. రామయ్య, భాగ్యమ్మ సంతానమైన కృష్ణతాత వయస్సు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికంలో మునిగి తేలుతూ తన సహజత్వాన్ని బయట పెడుతూ వచ్చాడు. 1934లో జన్మించిన కృష్ణతాత 91ఏళ్లపాటు జీవించారు.
రోజుల తరబడి ధ్యానముద్రలో..
కృష్ణతాత రోజుల తరబడి నిద్రాహారాలు మాని ధాన్యంలోకి వెళ్లిపోయేవాడు. కొండలు గుట్టలతోపాటు నీళ్లల్లో సైతం రోజుల తరబడి తిండితిప్పలు లేకుండా ఉండేవాడని పలువురు చెబుతున్నారు. అప్పట్లో ఎవరూ వెళ్లని చెన్నరాయుడి గుట్టకు వెళ్లి రోజుల తరబడి ఉండేవాడు. రుషీశ్వరులతో కలిసి తపస్సు చేసేవాడని కథలుకథలుగా చెబుతున్నారు. ఈయన వద్దకు మహబూబ్‌నగర్‌లో అబ్దుల్ ఖాదర్ దర్గాగా పిలువబడుతున్న అబ్దుల్ ఖాదర్, షాషాబ్‌గుట్టగా పిలవబడుతున్న షాషాబ్‌వంటి పెద్దపెద్దవారు వవ్చి వెళ్లేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆయనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భక్తులు, శిష్యులు చాలామంది ఉన్నారు. కులాలకతీతంగా అందరినీ చేరదీసే వారని ఆయన భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీలను దగ్గరగా కూర్చోబెట్టుకోవడమేకాక సామూహిక అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. ఆధ్యాత్మిక సత్సంగాలతోపాటు భజన కార్యక్రమాలు నిర్వహించేవారు.
తాతపై విశ్వాసంతోనే..
గ్రామంలో ఎక్కువ శాతం మంది కృష్ణతాత పేర్లే పెట్టుకున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏరోగం వచ్చినా తాతను సంప్రదించేవారు. ఇప్పటికి కూడా చాలామంది ఎలాంటి అనారోగ్యానికి గురైనా తాతను దర్శించుకొని అక్కడున్న విభూతి రాసుకుంటే తగ్గిపోందనే నమ్మకం చాలా మందిలో ఉంది. సహజసిద్ధుడైన తాతను నమ్ముకున్నవారు వివిధ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. ప్రతిఏటా తాతా పేరుమీద చాలా కార్యక్రమాలు జరుగుతాయి. – వెంకట్రామచారి,
ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త
భగవత్ స్వరూపడని భావించి
కృష్ణతాత భగవాన్ స్వ రూపడని మా నమ్మకం. తాతాపై ఉన్న భక్తి, న మ్మకంతోనే మాపెద్దలు తాతపేరు వచ్చేలా పె ట్టారు. తాతపేరు పెట్టుకుంటే అనారోగ్యం కలగదని, చీడపీడలు, దు ష్ట శక్తులు దరిచేరవని నమ్మకం. అంతా మంచే జరుగుతుందనేది మా నమ్మకం. జాతర ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటాం. మిగతా సమయంలో కూడా తాతను కొలుస్తుంటాం.
– అన్నసారం కృష్ణారెడ్డి, పగిడ్యాల్
ఇంటింటా తాతపేరు
పగిడ్యాల్‌లో ప్రతిఇంట్లో ఒకరికి కృష్ణతాత పేరు ఉంది. కృష్ణయ్య, కృష్ణప్ప, చిన్నకృష్ణయ్య, పెద్దకృష్ణయ్య, నడిపి కృష్ణయ్య, కృష్ణారెడ్డి ఇలా రకరకాలుగా తాతాపేరు వచ్చేలా పేర్లు పెట్టుకున్నారు. ఈ గ్రామం వారికి కృష్ణతాతపై అమితమైన భక్తి. అందుకే పేర్లు పెట్టుకోవడంతోపాటు తాత సేవలో తరిస్తుంటారు.
పగిడ్యాల్‌లో.. ‘కృష్ణతాత’
పగిడ్యాల్‌లో.. ‘కృష్ణతాత’
పగిడ్యాల్‌లో.. ‘కృష్ణతాత’


