కృష్ణబ్రహ్మేంద్రస్వామి జాతర ప్రారంభం
గండేడ్: మండలంలోని పగిడ్యాల్‌లో కృష్ణ బ్రహేంద్రస్వామి(కృష్ణ తాత) జాతర కృష్ణ బ్రహేంద్రస్వామి మఠంలో ప్రారంభమయ్యాయి. ఏటా రథసప్తమి సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం పల్లకీసేవలో స్వామివారి వ్రిగహాన్ని ఉంచి ఆలయం చుట్టూ భజనకీర్తనలతో ప్రదక్షిణ గావించారు. శనివారం అఖండ భజన, నందికోల సేవతో భక్తుల సందడి మొదలైంది. గండేడ్, సల్కర్‌పేట్, బల్సుర్‌గొండ, అంచన్‌పల్లి, వెన్నాచేడ్, రంగారెడ్డిపల్లి, మన్సూర్‌పల్లి వంటి పరిసర గ్రామాలతోపాటు కోస్గి, గుండుమాల్, హన్వాడ మండలాల భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రథసప్తమి సందర్భంగా మహాఘట్టం, సాధుపూజ, పాదుకపూజ, గంగాస్నానం, మహాన్నదానం, రాత్రి 9గంటలకు డోలారోహణం నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త వెంకట్రాములు, సర్పంచ్ కిష్టయ్య, పీఎస్ కృష్ణనాయక్ వసతులు కల్పించడంతోపాటు జాతర సజావుగా సాగడానికి కృషి చేస్తున్నారు. ఎస్సై శేఖర్‌రెడ్డి ఎలాంటి ఆవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.


