తల్లి మందలించిందని ఆత్మహత్య
గద్వాల (మల్దకల్): తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మేకలసోంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మేకలసోంపల్లికి చెందిన కుర్వ చిన్న ఆంజనేయులు, సుజాతమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె. వీరిలో మొదటి కుమారుడైన హరీష్ (18) వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. అయితే ఇటీవల తమ్ముడు తెచ్చుకున్న గొర్రె పిల్లలను సంతలో అమ్ముకున్నాడు. దీంతో తల్లి మందలించింది. ఈ క్రమంలో పురుగు మందు తాగగా గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
మద్దూరు: యువకుడు అత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అప్పిరెడ్డిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన భీమేష్ (22) ట్రాక్టర్ డైవర్‌గా పనిచేసేవాడు. వారం క్రితం కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడగా ఇటీవల యువతి ఇంటికి వెళ్లాడు. గమనించిన యువతి కుటుంబ సభ్యులు యువతిని పెళ్లి చేసుకోవాలని అప్పిరెడ్డిపల్లిలో పంచాయతీ నిర్వహించారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు శనివారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఊరేసుకున్నాడు. తన కొడు కును యువతి కుటుంబసభ్యులు బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని, వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
భూత్పూర్: మండలంలోని అమిస్తాపూర్‌కు చెందిన బోడ మహేష్ (32) కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. మహేష్‌కు సిద్దాయిపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు కాగా భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్ధితి సరిగా లేకపోవడంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. శనివారం భార్యాభర్తలిద్దరూ గొడవ పడగా భార్య బయటికి వెళ్లింది. ఈ క్రమంలో తలుపులు వేసుకొని ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య తలుపు కొట్టిన తెరవకపోవడంతో పగలగొట్టి వెళ్లే సరికి మృతి చెందాడు. మృతుడి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఇంద్రకల్ ఘటనపై
సస్పెన్షన్ వేటు
తాడూరు: మండలంలోని ఇంద్రకల్‌లోని ప్రభుత్వ పాఠశాల గేటు ఎదుట విద్యుత్ స్థంభానికి వేలాడుతున్న విద్యుత్ వైరు తగిలి 9వ తరగతి విద్యార్థి లోకేష్ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదం పొంచి ఉందని ముందే సమాచారం ఇచ్చినప్పటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో లైన్‌మెన్ సాయిప్రకాష్‌గౌడ్, ఆపరేషన్ డీఈ శ్రీధర్‌శెట్టిలపై సస్పెన్షన్ వేటు వేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారితో పాటు ఎస్‌ఈ నర్సింహ్మరెడ్డి, ఏడీ శ్రీనివాసులు, ఏఈ శ్రీరాములుకు మోమోలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న ఎద్దుల పట్టివేత
వనపర్తి రూరల్: వాహనాల తనిఖీల్లో భాగంగా ఎద్దులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు పెబ్బేరు ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి స్థానిక సంత వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లలో 128 ఎద్దులు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో కంటైనర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. ఎద్దులను మహబూబ్‌నగర్‌లోని శ్రీలక్ష్మి గోసంరక్షణ ట్రస్టుకు తాత్కాలిక ఆశ్రయం కోసం అప్పగించామన్నారు. 4 వాహనాలను సీజ్‌చేసి.. డ్రైవర్లు, యజమానులైన 12 మందిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
24డబ్ల్యూఎన్‌పి804 : ఎద్దులను తరలిస్తున్న కంటైనర్లు ఇవే..
తల్లి మందలించిందని ఆత్మహత్య


