ఇంటర్‌లో వందశాతం ఫలితాలు సాధించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్‌లో 100శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ విజయేందిరబోయి సూచించారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇంటర్మీడియట్ ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, అందులో మంచి ప్రతిభ కనబర్చిన వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. పరీక్షలకు నెల రోజుల సమయం ఉన్నందున ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సిద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవం, అర్హతలు ఉన్న అధ్యాపకులు ఉన్నారని, వారి బోధనలో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం ఐఏఎఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజినీరింగ్ చేశారని గుర్తు చేశారు. లక్ష్య సాధనకు పేదరికం అడ్డుకాదని, ప్రతి రోజూ న్యూస్ పేపర్‌లు చదివి, పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుందన్నారు. మంచి ఆహారం తీసుకుని ఆటల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, అధ్యాపకులు పాల్గొన్నారు.


