ట్రాఫిక్ నిబంధనలు పాటించడం బాధ్యత
● ప్రాణాలు కాపాడే రక్షణ కవచం హెల్మెట్
● ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్ క్రైం: ప్రతి వాహనదారుడికి హెల్మెట్ ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ కవచం అవుతుందని, దీని వల్ల జరిగే ప్రాణ రక్షణపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అరైవ్–అలైవ్ నినాదంతో పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. ర్యాలీ క్లాక్‌టవర్, అశోక్ టాకీస్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, మెట్టుగడ్డ మీదుగా తిరిగివన్‌టౌన్ కూడలి వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతి పోలీస్ వాహనదారుడు హెల్మెట్ ధరించి దాని ప్రాముఖ్యతను తెలియజెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ప్రధానంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని, దీని వల్ల ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి నిబంధనలు పాటించాలన్నారు.


