ప్రతి మనిషికి ఆర్టీసీతో విడదీయలేని బంధం
● మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర
● ఘనంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రతి మనిషికి ఆర్టీసీతో విడదీయలేని బంధమని, ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీపై ఆధారపడి ఉంటారని కలెక్టర్ విజయయేందిర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ తాను కళాశాలలో చదివేటప్పుడూ తమ కాలనీ నుంచి కింగ్‌కోఠికి బస్సులో వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తారని అన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. రోడ్డు భద్రతా విషయంలో ఇతర రాష్ట్రాల సంస్థలతో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ పనితీరు చాలా బాగుందన్నారు. ఇదే స్ఫూర్తితో బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ మాట్లాడుతూ మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా ప్రమాదాన్ని నివారించవచ్చని అన్నారు. మన జీవితంలో భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా రోడ్డు భద్రతపై ఆయన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏఎస్‌పీ రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి రఘు మాట్లాడారు. అనంతరం ప్రమాదరహిత డ్రైవింగ్‌లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచిన కల్వకుర్తి డిపోకు చెందిన అంజయ్య, జోన్‌లో ఎల్ రాములు–షాద్‌నగర్ (ద్వితీయ), దేవుజా–నారాయణపేట (తృతీయ), రీజినల్‌లో భద్రయ్య–కోస్గి (ప్రథమ), ఎం.రాముడు–గద్వాల (ద్వితీయ), పి.రామప్ప–షాద్‌నగర్ (తృతీయ), డిపో స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. చిత్రలేఖన, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంలు లక్ష్మిధర్మ, కవిత, మహబూబ్‌నగర్ డీఎం అశోక్‌కుమార్, పీఓ వెంకటేశ్వర్లు, ఏఓ గంగాధర్, ఇతర డిపోల డీఎంలు, ఉద్యోగులు పాల్గొన్నారు.


