విద్యార్థి మృతిపై అధికారుల విచారణ
విద్యార్థి కుటుంబానికి అర్థిక సాయం అందిస్తున్న అధికారులు
తాడూరు: మండలంలోని ఇంద్రకల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి లోకేశ్ విద్యుదాఘాతంలో మంగళవారం మృతి చెందిన ఘటనపై బుధవారం ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు(ఆర్జేడీ) సోమిరెడ్డి విచారణ చేపట్టారు. జిల్లా విద్యాధికారి రమేష్‌తో కలిసి పాఠశాలను సందర్శించి మృతి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మంగళవారం పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్న స్తంభానికి విద్యార్థి తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడినట్లు తెలిపారు. ఉపాధ్యాయుడు విద్యార్థిని జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఆర్జేడీ మాట్లాడుతూ.. పాఠశాల సమయంలో విద్యార్థులను బయటికు పంపరాదని, వారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించి రూ. 20 వేలు, విద్యుత్ శాఖ తరఫున రూ.20 వేల నగదుతో పాటు రూ. లక్ష నష్టపరిహార చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజుగౌడ్, సర్పంచ్ బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ అధికారుల ఎక్స్‌గ్రేషియా
టీజీఎస్‌డీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్‌అలీ ఫరూకీ ఆదేశాల మేరకు అపరేషన్ డైరెక్టర్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, మేడ్చల్ చీఫ్ ఇంజినీర్ కామేశ్వర్ విద్యార్థి లోకేశ్ మృతిపై విచారణ చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపర్ ఇంజినీర్ నర్సింహ్మరెడ్డి, విద్యుత్ అధికారులు శ్రీనివాసులు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత


