బీఆర్‌ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతల దాడి
భూత్పూర్: బీఆర్‌ఎస్ కార్యకర్తపై దాడిచేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివశంకర్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మండలంలోని మద్దిగట్లకు చెందిన వెంకటేశ్ గౌడ్‌ను మంగళవారం సాయంత్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డి కలిసి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి రైతువేదిక వద్ద అసభ్యకర పదజాలంతో దుర్బాషలాడుతూ.. కర్రలతో చితకబాది బెదిరింపులకు గురిచేసినట్లు బాధితిడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డి, భూపతిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఎస్‌ఎంలో పోస్టు చేసిన
కారణంతో దాడి
డిసెంబర్‌లో మద్దిగట్లకు చెందిన వెంకటేశ్‌గౌడ్ సామాజిక మాధ్యమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై అసభ్యకర పదజాలంతో పోస్టు చేయడంతో డిసెంబర్‌లో భూత్పూర్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో మంగళవారం వెంకటేశ్‌గౌడ్‌పై దాడిచేసినట్లు తెలిసింది. వెంకటేశ్‌గౌడ్‌ను సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతోపాటు, వ్యక్తిగత విమర్శలు చేసేవిధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టరాదని పోలీసులు మందలించినట్లు తెలిసింది.


