సీఎన్‌బీ అధికారుల మెరుపు దాడులు | - | Sakshi
Sakshi News home page

సీఎన్‌బీ అధికారుల మెరుపు దాడులు

Dec 17 2025 10:50 AM | Updated on Dec 17 2025 10:50 AM

సీఎన్‌బీ అధికారుల మెరుపు దాడులు

సీఎన్‌బీ అధికారుల మెరుపు దాడులు

గద్వాల క్రైం: సెంట్రల్‌ నార్కోటిక్‌ ఆఫ్‌ బ్యూరో అధికారులు సోమవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేపట్టి.. నిషేధిత ఆల్ఫాజోలం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 171 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టిన సీఎన్‌బీ అధికారులు.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్‌ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన ఈడిగి నరేశ్‌గౌడ్‌ నిషేధిత మత్తు పదార్థం (ఆల్పాజోలం)తో హైదరాబాద్‌ నుంచి వాహనంలో గద్వాలకు బయలుదేరాడు. పక్కా సమాచారం మేరకు సీఎన్‌బీ అధికారులు సుష్‌పాల్‌, పవన్‌, సాయివరుణ్‌, గౌరవ్‌లు అతడి వాహనాన్ని ఎర్రవల్లి–గద్వాల మార్గంలో పట్టుకొని 171 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలం తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆల్ఫాజోలం విలువ రూ. 4లక్షలు ఉంటుందని తెలిపారు. కాగా, నిందితుడు నరేశ్‌గౌడ్‌ను సీఎన్‌బీ అధికారులు గద్వాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టగా.. పలువురు కీలక వ్యక్తుల పేర్లును బహిర్గతం చేసినట్లు తెలిసింది. నిందితుడు తన స్వగ్రామంలో కల్లు దుకాణం ఏర్పాటు చేసుకుని కల్లు విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

వెలుగులోకి ఇలా..

హైదరాబాద్‌లో నివాసముంటున్న మెదక్‌ జిల్లావాసి సుంకి శ్రీనివాస్‌ అలియాస్‌ కృష్ణతో నరేశ్‌గౌడ్‌ నిషేధిత ఆల్ఫాజోలం కొనుగోలుచేసి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే సుంకి శ్రీనివాస్‌ను సీఎన్‌బీ అధికారులు పట్టుకొని విచారణ చేపట్టగా.. ఆల్ఫాజోలం మాఫియా దందా వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడి సమాచారం మేరకు సీఎన్‌బీ అధికారులు బృందాలుగా ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఓ బృందం కర్నూలు జిల్లాలో ఇద్దరు నిందితులు నవీన్‌, మాధవ్‌ అలియాస్‌ గోపాల్‌ వద్ద 3 కేజీల ఆల్ఫాజోలం పట్టుకోగా.. మరో బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలో నరేశ్‌గౌడ్‌ వద్ద 171 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు.

సిన్నీ ఫక్కీలో..

ఎర్రవల్లి–గద్వాల మార్గంలో కాపు కాసిన సీఎన్‌బీ అధికారులు.. నరేశ్‌గౌడ్‌ వాహనాన్ని గుర్తించి నిలుపు దల చేశారు. అయితే వారి నుంచి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఓ అధికారి గన్‌ ఎక్కుపెట్టడంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది.

అంతా గోప్యం..

మాదకద్రవ్యాలను సరఫరాచేసే మాఫియాను సెంట్రల్‌ నార్కోటిక్‌ ఆఫ్‌ బ్యూరో అధికారులు గుర్తించిన క్రమంలో ఎకై ్సజ్‌, పోలీసు, ఇంటెలిజెన్సీ, ఎస్‌బీ విభాగం అధిపతులకు ముందస్తు సమాచారం చేరవేయకుంగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మెదక్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుబడిన నిందితుల జాబితా బయట తెలియకుండా అంతా గోప్యంగా విచారించి.. పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఈ చీకటి దందా వెనుక ఉన్న అసలు దోషులు ఎవరనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో ప్రకృతిసిద్ధ కల్లు కంటే ప్రమాదకరమైన కల్లు విక్రయాలు ఉన్నట్టు గుర్తించిన సీఎన్‌బీ అధికారులు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది.

నడిగడ్డలో 171 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలం సీజ్‌

సనీ ఫక్కీలో బిజ్వారం గ్రామవాసి అరెస్టు

ప్రధాన నిందితుడి అరెస్టుతో వెలుగులోకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement