సీసీకుంట పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు
● బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
● ఎస్‌ఐ హామీతో ధర్నా విరమించిన గ్రామస్తులు, కుటుంబీకులు
చిన్నచింతకుంట: ప్రమాదవశాత్తు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన మధు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నచింతకుంట పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి భార్య మనీష, గ్రామస్తులు మాట్లాడుతూ.. గరుడ కెమికల్ కంపెనీకి చెందిన బొలేరో డ్రైవర్ బొలేరోను నిర్లక్ష్యంగా నడుపుతూ ఏదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టి కౌకుంట్ల మండలం అప్పంపల్లికి చెందిన తెలుగు మధును అకారణంగా చంపేశాడని ఆరోపించారు. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి పెద్దదిక్కు మృతిచెందడంతో భార్యాపిల్లలు రోడ్డున పడ్డారని వాపోయారు. మృతుడి కుంటుబానికి సరైన న్యాయం చేయాలని రెండురోజులుగా పోలీసులను ఆశ్రయిస్తున్నా.. పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఓ పక్కన మృతదేహాన్ని పెట్టుకొని భార్యాపిల్లలు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతూ తల్లడిల్లిపోతున్నారని వాపోయారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నిరసన వద్దకు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి చేరుకొని బాధితులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కుటుంబానికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
పోలీసులు డ్రామా చేస్తున్నారని ఆరోపణ
మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇస్తూ పోలీసులు డ్రామా చేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. సోమవారం రాత్రి ప్రమాదం జరిగిన ఘటన వద్దనే మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదలనివ్వమని భీష్మిస్తే బొలేరో యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి తగు న్యాయం చేస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. తీరా ఉదయం చూస్తే బొలేరో యాజమాన్యంతో చేతులు కలిపి యాజమాన్యం స్పందించడంలేదంటూ చావుకబురు చల్లగా చెబుతున్నారని ఆరోపించారు. రెండురోజులుగా తిండీతిప్పలు లేక కుటుంబ సభ్యులు అల్లాడుతుంటే పోలీసులకు ఆటవిడుపుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఉన్నతాధికారులు గమనించాలని కోరారు.


