స్థానభ్రంశం అనివార్యం.. ఉన్నచోట చివరి ఓటు!
జడ్చర్ల టౌన్: ఉదండాపూర్, వల్లూరు రెండు గ్రామాల్లోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు ఇవే చివరివి. అదేమిటి రెండు గ్రామాలు మున్సిపాలిటీలో ఏవైనా.. విలీనమవుతున్నాయా.. అనే సందేహం వస్తుంది. అదికాదు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతుండడంతో ఆ గ్రామాలు అక్కడి నుంచి తరలింపు అనివార్యమవుతుంది. ప్రస్తుతం రెండు గ్రామాలకు అక్కడ ఎన్నికలు చివరివి కావడం గమనార్హం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఉదండాపూర్, వల్లూరు జీపీలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఆ రెండు గ్రామాలకు బండమీదిపల్లి జీపీ సమీపంలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముంపు నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఆలస్యం కావడంతో ఇంకా గ్రామాల తరలింపు జరగలేదు. కొన్నేళ్లుగా గ్రామస్తులు పోరాటం చేస్తూనే ఉన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పునరావాసానికి హామీ ఇచ్చినప్పటికీ సాధ్యపడలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ముంపు బాధితుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్యాకేజీ పెంపునకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రూ.144కోట్లు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ ముగిశాక ఆ డబ్బులు నిర్వాసితులకు పంపిణీ చేయనున్నారు. దీంతో గ్రామాల తరలింపు అనివార్యంగా మారింది. ఏడాదిలోగా గ్రామం పూర్తిగా తరలింపు కావాల్సిందే. అందుకే రెండు జీపీలకు ప్రస్తుతం ఉన్నచోట జరిగే ఎన్నికలు ఇవే చివరివి. పునరావాసం తర్వాత ఇవే గ్రామాలకు ఎన్నికలు జరగనున్నప్పటికీ స్థానభ్రంశం తప్పదు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇక్కడే జరిగే అవకాశాలున్నాయి.
స్థానభ్రంశం అనివార్యం.. ఉన్నచోట చివరి ఓటు!


